మలేషియాలో టూరిస్ట్ వీసాతో ఉద్యోగం చేయొద్దు : భారత హైకమిషన్

మలేషియాలో టూరిస్ట్ వీసాతో ఉద్యోగం చేయొద్దు : భారత హైకమిషన్
  • 30 రోజుల వీసా రహిత ప్రవేశం పర్యాటకానికే
  • ఉద్యోగాల పేరుతో మోసపోవద్దని భారత హైకమిషన్ హెచ్చరిక

సింగపూర్: మలేషియాలో ఉద్యోగం కోసం 30 రోజుల వీసా రహిత ప్రవేశ సౌకర్యాన్ని ఉపయోగించుకోవద్దని భారత హైకమిషన్ హెచ్చరించింది. ఈ సౌకర్యం కేవలం పర్యాటకం, సామాజిక సందర్శనల కోసమేనని స్పష్టం చేసింది. ఉద్యోగం చేసేందుకు ఎలాంటి అనుమతి ఉండదని తెలిపింది. ఈ మేరకు మంగళవారం ‘ఎక్స్‌‌’ వేదికగా అడ్వైజరీ జారీ చేసింది. తప్పుడు ఉద్యోగాల పేరుతో మోసపోతున్న భారతీయుల సంఖ్య పెరుగుతోందని హైకమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది.

కొందరు అనైతిక ఏజెంట్ల మాటలు నమ్మి మలేషియాకు వెళ్లి ఇబ్బందుల్లో పడుతున్నారని తెలిపింది. వీసా గడువు ముగిసినా అక్కడే ఉండిపోతే ఓవర్‌‌స్టే, చట్టపరమైన సమస్యలు, దోపిడీ, నిర్బంధం, లీగల్ యాక్షన్ ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. మలేషియాకు టూరిజం కోసం వెళ్లేవారు ధ్రువీకరించిన రిటర్న్ టికెట్, హోటల్ బుకింగ్ వివరాలు వెంట ఉంచుకోవాలని హైకమిషన్ సూచించింది.

ప్రయాణానికి మూడు రోజుల ముందు మలేషియా డిజిటల్ అరైవల్ కార్డ్ (ఎండీఏసీ) సమర్పించాలని తెలిపింది. పాస్‌‌పోర్ట్‌‌కు కనీసం ఆరు నెలల వ్యాలిడిటీ ఉండాలని పేర్కొంది. సరైన వర్క్ పర్మిట్ లేదా రిఫరెన్స్‌‌తో కూడిన వీసా (వీడీఆర్) లేకుండా ఉద్యోగం కోసం మలేషియాకు వెళ్లొద్దని హైకమిషన్ స్పష్టం చేసింది.